* కేరళ ప్రజారోగ్య వ్యవస్థపై దుర్మార్గపు దాడులను ఖండించండి




 * కేరళ ప్రజారోగ్య వ్యవస్థపై దుర్మార్గపు దాడులను ఖండించండి 

– సిపిఎం పిలుపు

న్యూఢిల్లీ : కేరళ ప్రజారోగ్య వ్యవస్థపై జరిగిన దుర్మార్గపు దాడులను సిపిఎం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు పొలిట్‌బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది. కెఎస్‌యు గూండాలు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి వీణా జార్జిపై జరిపిన దాడిని తీవ్రంగా నిరసించింది. వరుసగా పదేళ్ల పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వ విజయాలను ఎదుర్కొనలేని కాంగ్రెస్‌, ఇతర వామపక్ష వ్యతిరేక శక్తుల అసహనాన్ని ఈ దాడులు ప్రతిబింబిస్తున్నాయని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ప్రజారోగ్య రంగంలో ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రపంచవ్యాప్తంగా అందరి ఆదరాభిమానాలను, గుర్తింపును గెలుచుకున్నాయి. ఎల్‌డిఎఫ్‌పై ఆరోపణలు చేయడానికి ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోని బిజెపి ప్రభుత్వం కూడా ఈ వాస్తవాన్ని గుర్తించాల్సి వచ్చింది. దేశంలోనే అత్యధిక మొత్తంలో ఉచిత చికిత్సను అందించినందుకు గానూ వరుసగా మూడేళ్ల పాటు కేరళకు అవార్డు కూడా ఇవ్వాల్సి వచ్చింది. అంటువ్యాధులు కాని వ్యాధులపై ప్రత్యేక చొరవ తీసుకున్నందుకు గానూ తిరువనంతపురంలోని రీజనల్‌ కేన్సర్‌ సెంటర్‌ ఐక్యరాజ్య సమితి అవార్డు అందుకుంది. కేరళలో శిశు మరణాల రేటు (ఐఎంఆర్‌)ను 5కి తగ్గించారు. ఇది, అధిక తలసరి ఆదాయం కలిగిన అమెరికా (5.6) రేటు కన్నా చాలా మెరుగైనది. రాష్ట్ర ప్రజారోగ్య రంగం పట్ల ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందో, తీవ్రంగా శ్రమిస్తుందో ఇవన్నీ స్పష్టంగా రుజువు చేస్తున్నాయి. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విధిస్తూ వచ్చిన తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు వున్నప్పటికీ ఈ విజయాలను సాధించడం సాధ్యమైంది. ఆరోగ్య రంగంపై యుడిఎఫ్‌ ప్రభుత్వం (2011-16) పెట్టిన ఖర్చు రూ.18,825.44 కోట్లు కాగా, ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం (2016-21) అంతకు రెట్టింపుగా రూ.36,651.79 కోట్లు ఖర్చు చేసింది. గత నాలుగేళ్లలో (2021-25), ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం మరో రూ.41,510.43 కోట్లు ఖర్చు పెట్టింది. ఈ అధిక వ్యయ మొత్తాలు చూస్తుంటే ప్రజారోగ్యం పట్ల ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వానికి గల నిబద్ధత ఎలాంటిదో అర్ధమవుతుంది. ఆరోగ్యంతో సహా అన్ని రంగాల్లోనూ ప్రైవేటు శక్తులను పెంపొందించాలన్నది కాంగ్రెస్‌, బిజెపిల విధానంగా వున్నందున ప్రజారోగ్య రంగంలో ఎల్‌డిఎఫ్‌ సాధించిన ఈ విజయాలు వారికి మింగుడుపడడం లేదు. రాష్ట్రంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టినప్పటికీ కేరళలోకి ప్రైవేటురంగం బాగా చొచ్చుకుపో వడంలో విఫలమైందంటే అందుకు బలమైన ప్రభుత్వరంగం వుండడమే ప్రధాన కారణం. చెడుగా చిత్రీకరించడం ద్వారా ప్రైవేటు రంగం విస్తరణకు వెసులుబాటు కల్పించడానికే కేరళ ప్రజారోగ్య వ్యవస్థపై దాడులు జరిగాయి. ఈ దాడులను సిపిఎం తీవ్రంగా నిరసిస్తోంది. ఈ నీచపుటెత్తుగడలను సమగ్రంగా అర్థం చేసుకోవాలని, కేరళలోని ప్రజారోగ్య వ్యవస్థను, ఎల్‌డిఎఫ్‌ను సమర్ధిస్తూ బాసటగా నిలబడాలని ప్రజలను సిపిఎం కోరింది.


మంత్రిపై దాడిని ఖండిస్తూ దేశవ్యాప్త నిరసనలకు ఐద్వా పిలుపు

కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జిపై కెఎస్‌యు కార్యకర్తలు పాల్పడిన దాడిని ఐద్వా తీవ్రంగా ఖండించింది. ఒక మహిళా మంత్రిపై ఇలా దాడి జరగడం, పైగా దాడి జరిగిన తీరు అనూహ్యమైనదని ఐద్వా విమర్శించింది. ఈ దాడులను నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చింది. ఇది కేవలం ప్రభుత్వ విధుల్లోని ఒక వ్యక్తిపై జరిగిన దాడిగా చూడలేమని, మొత్తంగా మహిళలపై జరిగిన దాడిగా చూడాలని పేర్కొంది. ఈ దాడిని తీవ్రంగా నిరసించిన ఐద్వా ఇందుకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. చైతన్యవంతులైన ప్రజానీకం కూడా ముందుకు వచ్చి ఇందుకు వ్యతిరేకంగా తమ వాణిని వినిపించాలని కోరింది. కాంగ్రెస్‌ జాతీయ నాయకత్వం కూడా ఈ హేయమైన దాడిని ఖండించాలని డిమాండ్‌ చేసింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు