ప్రజల భద్రతే మా ధర్మం.. సురక్షిత ప్రయాణమే మా లక్ష్యం




 • ప్రజల భద్రతే మా ధర్మం.. సురక్షిత ప్రయాణమే మా లక్ష్యం.


ట్రాఫిక్ నిబంధనలు మీకు, మీ కుటుంబానికి, ఇతర వాహనదారులకు రక్షణ.

మెడికల్ క్యాంప్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్.



సంగారెడ్డి ,అక్షిత మీడియా:-


“అరైవ్ అలైవ్ – 2026” రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా   27.02.2026 న జహీరాబాద్ పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీ, పస్తాపూర్ చౌరస్తాలలో ట్రాఫిక్ సిగ్నల్స్‌ను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ ప్రారంభించారు. అనంతరం ఎస్.వి. ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన మెగా ఐ-చెక్‌అప్ మెడికల్ క్యాంపును ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమమే “అరైవ్ అలైవ్ - 2026” అని అన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాలలో జహీరాబాద్ ఒకటని, ఇతర రాష్ట్రాలను కలుపుతూ ఉన్న జాతీయ రహదారుల వలన ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటుందని, ఈ సమస్యను తగ్గించేందుకు ఆదర్శనగర్ కాలనీ, పస్తాపూర్ చౌరస్తాలలో ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ప్రారంభించినట్లు తెలిపారు.


అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా జహీరాబాద్ సబ్-డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సులు, లారీలు, ఆటోలు నడిపే డ్రైవర్లకు కంటి చూపు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చూపులో లోపాలు ఉన్న వారికి ఉచితంగా కళ్లద్దాలు అందజేయడం జరుగుతుందని చెప్పారు. కచ్చితమైన కంటి చూపు ఉన్నప్పుడే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సురక్షితంగా డ్రైవింగ్ చేయగలమని అన్నారు.


ప్రతిరోజు పాఠశాలలు, కాలేజీలు, కార్యాలయాలకు వెళ్లే ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చడంలో డ్రైవర్ల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. వాహనాలను పరిమిత వేగంలో నడుపుతూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అతి వేగం ప్రమాదకరమని గుర్తు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం మీకే కాకుండా మీ కుటుంబ సభ్యులకు, తోటి వాహనదారులకు కూడా రక్షణ కల్పిస్తుందని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో కుటుంబ యజమానిని కోల్పోతే ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని గుర్తు చేశారు.


డ్రైవర్లు వాహనాల కండిషన్‌ను తరచూ తనిఖీ చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపరాదని హెచ్చరించారు. మద్యం మత్తులో ఏకాగ్రత కోల్పోవడం వల్ల ప్రమాదాలకు దారితీయవచ్చని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. అనంతరం ట్రాఫిక్ నిబంధనలు పాటించాలనే ప్రతిజ్ఞ చేయించారు 

ఈ కార్యక్రమంలో జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్, ఇన్‌స్పెక్టర్లు శివలింగం, హనుమంతు, మున్సిపల్ చైర్మెన్ యూనస్, వైస్ చైర్మెన్ శిరిషా-సురేందర్ రెడ్డి, కమిషనర్ జైత్రం, ఆర్.టి.సి డిపో మేనేజర్ స్వామి, మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, టౌన్ మరియు రూరల్ ఎస్ఐలు వినయ్ కుమార్, కాశీనాథ్ తదితర సబ్-డివిజన్ పోలీసు అధికారులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1 కామెంట్‌లు